దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. ఢిల్లీలోని తాతెసర్ ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఓ ఖాళీ క్యాట్రిడ్జ్, రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు.
గాయపడిన వారిని ముకుల్( 20), చందర్ ప్రకాశ్ ( 24)గా పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చంద్ పూర్ గ్రామానికి చెందిన వారని పేర్కొన్నారు. వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. దుండగులను గుర్తించినట్టు తెలిపారు.
దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. గత నెలలోనూ ఢిల్లీలోని చంచల్ పార్క్ ఏరియాలో కాల్పులు జరిగాయి. చంచల్ పార్క్‌లోని సోమ్ బజార్ రోడ్డులో ఉన్న కేబుల్, వైఫై కార్యాలయం వద్దకు ముగ్గురు దుండగులు బైక్ పై వచ్చారు.
వారిలో ఇద్దరు కార్యాలయంలోకి చొరబడి హితేష్ (22) అనే ఉద్యోగి పై కాల్పులు జరిపారు. దీంతో హితేష్ కు తీవ్రగాయాలు కాగా అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.