ఏపీలో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొనిదెన గ్రామ పరిధిలో ఓ లారీని ఆపి.. పోలీసులమని చెప్పి రూ.2 లక్షులు దోచేశారు.
పల్సర్ వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు రాజుపాలెం వైపు నుంచి వస్తున్న గ్రానైట్ లారీని అడ్డుకున్నారు. తాము బల్లికురవ పోలీసులమని చెప్పి బిల్లులు చూపించాలన్నారు. లేకపోతే రూ.2 లక్షలు చెల్లించాలని బెదిరించారు. డ్రైవర్ పై కర్రలతో దాడి కూడా చేశారు. దీంతో భయపడిపోయిన డ్రైవర్.. గ్రానైట్ ఓనర్ లలిత్ కు ఫోన్ చేశాడు. జరిగిందంతా వివరించాడు. అయితే అతని దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో ఒంగోలులోని బంధువుల దగ్గర తీసుకుని.. డ్రైవర్ కు ఫోన్ చేశాడు. నిందితుల వాహనంపై లలిత్ దగ్గరకు వెళ్లిన డ్రైవర్ రూ.2 లక్షలు తీసుకొచ్చి దుండగులకు ఇచ్చాడు.
ఈ ఘటనతో భయపడిపోయిన గ్రానైట్ ఓనర్ లలిత్ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే పోలీసులకు తెలియడంతో దర్యాప్తు పారంభించారు. నిందితులిద్దరూ మాస్కులు ధరించి.. నెంబరు ప్లేట్ లేని పల్సర్ వాహనంపై వచ్చి దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు లారీ డ్రైవర్. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.