కర్ణాటక,హర్యానా రాష్ట్రాల్లో హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజా వైరస్ సంబంధ మరణాలకేసులు వెలుగు చూశాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి మరణాల కేసులు నమోదు కాలేదని, మొదట కర్ణాటకలో, తరువాత హర్యానాలో ఇవి నమోదయ్యాయని వారు తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ వైరస్ తో బాటు తిరిగి కోవిడ్ కేసులు కూడా పెరుగుతున్నాయని వారు చెప్పారు. దగ్గు, జ్వరం, నీరసం, వాంతులు, శ్వాస సంబంధ వంటి రుగ్మతలతో కూడిన హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లుయెంజాతో అనేకమంది రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
వీరిలో పిల్లలు, మహిళలు, వృద్దులు కూడా ఉన్నారు. కర్ణాటకలో ఈ నెల 1 న 82 ఏళ్ళ వృద్దుడు ఈ లక్షణాలతో మరణించారు. ఇది ఈ వైరస్ సంబంధ మృతి కేసేనని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా ఆసుపత్రుల్లో విధిగా మాస్కులు ధరించాలని ఇటీవల ఆదేశించింది. పిల్లలు, 65 ఏళ్ళ వయస్సు పైబడినవారు, గర్భిణులు అనవసరమైన సభలు, సమావేశాలవంటి ‘గేదరింగ్’ లకు వెళ్లకుండా దూరంగా ఉండాలని కూడా ప్రభుత్వం సూచించింది.
ఇప్పటివరకు ఇండియాలో ఈ తరహా కేసులు 90 ఉన్నట్టు గుర్తించారు. తమ రాష్ట్రంలో 26 మంది ఈ వైరస్ కి సంబంధించి పాజిటివ్ లక్షణాల రోగులు ఉన్నట్టు తెలిసిందని, బెంగుళూరులో రెండు కేసులు బయటపడ్డాయని కర్ణాటక వైద్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. కాన్పూర్ లో హెచ్ 3ఎన్ 2 తో బాటు హెచ్ 1 ఎన్ 1 కేసులను కూడా గుర్తించినట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో సుమారు 50 మందికి పైగా రోగులు ఈ లక్షణాలతో చేరినట్టు వారు చెప్పారు.
దగ్గు, జలుబు తదితర రుగ్మతలతోబాధ పడుతున్నప్పుడు ఇష్టమొచ్చినట్టు యాంటీ బయాటిక్స్ మందులు వాడడం మంచిది కాదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచించింది.