టైటిల్ లేకుండానే షూటింగ్ జరుపుకుంటోంది బాలయ్య సినిమా. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు కనీసం వర్కింగ్ టైటిల్ కూడా పెట్టలేదు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. బాలయ్య సినిమాకు మరో వారం రోజుల్లో టైటిల్ ఫిక్స్ చేయాలి. ఆ వెంటనే టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయాలి. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు బాలయ్య.
ప్రస్తుతం వినిపిస్తున్న గాసిప్స్ ప్రకారం, బాలయ్య సినిమాకు అన్నగారు, వీరసింహారెడ్డి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో అన్నగారు టైటిల్ వైపు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ఓ కారణం కూడా ఉంది. పెద్ద ఎన్టీఆర్ ను ఎక్కువమంది అన్నగారు అని పిలిచేవారు. కాబట్టి ఆ పేరు బాలయ్యకు సరిగ్గా సూట్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మరో వర్గం మాత్రం బాలయ్య సినిమా అంటే సింహా అనే టైటిల్ ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. అందుకే వీరసింహారెడ్డి అనే టైటిల్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ విషయంలో బాలకృష్ణ జోక్యం చేసుకోకపోవడం విశేషం. దర్శకుడు నిర్ణయించిన టైటిల్ కే ఆయన ఓటు వేయబోతున్నారు. సో.. ఇప్పుడు గోపీచంద్ మలినేని ఏ టైటిల్ సెలక్ట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు టైటిల్స్ నుంచి ఒకటి సెలక్ట్ చేస్తారా లేక మరో కొత్త టైటిల్ తో తెరపైకి వస్తారా అనేది వేచిచూడాలి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ నటుడు దునియా విజయ్, ఈ సినిమాతో టాలీవుడ్ కు విలన్ గా పరిచయమౌతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.