అమెరికాలో భారత సంతతికి అపూర్వ గౌరవం దక్కనుంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ బృందంలో ఏకంగా 20 మంది ఇండియన్ అమెరికన్‌లను కీలక పదవులు వరించాయి. ఇందులో ఏకంగా 17 మంది వైట్‌హాస్‌లో కీలక పోస్టుల్లో నియామకం అవుతున్నారు. పైగా మొత్తం 20 మందిలో 13 మంది మహిళలు మన మూలాలు ఉన్నవారే కావడం మరో విశేషం. యూఎస్ జనాభాలో జస్ట్ ఒక శాతం మాత్రమే ఉన్న భారతీయ అమెరికన్లకు.. అమెరికా అధికారిక యంత్రాంగంలో ఈస్థాయిలో గౌరవం దక్కడం ఆ దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి.ఇక అమెరికా చరిత్రలో ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తొలి ఇండియన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ ఘనత సాధించబోతున్నారు. రానున్న రోజుల్లో అధ్యక్ష బృందంలో మరింత మంది ఇండియన్ అమెరికన్లకు మంచి పదవులు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అధ్యక్ష బృందంలో చోటు సంపాదించిన వారిలో.. అత్యంత కీలకమైన వైట్‌హౌజ్ మేనేజ్‌మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా నీరా టాండన్‌కు బైడెన్ అవకాశం కల్పించారు. అసోసియేట్ అటార్నీ జనరల్‌గా వనితా గుప్తా, యూఎస్ సర్జన్ జనరల్‌గా డాక్టర్ వివేక్ మూర్తిని నియమించారు. బైడెన్ సతీమణి, అమెరికాకు కాబోయే ఫస్ట్ లేడీ జిల్ బైడెన్‌కు పాలసీ అడ్వైజర్‌గా మాలా అడిగాకు చాన్స్ ఇవ్వగా.. డిజిటల్ డైరెక్టర్‌గా గరిమా వర్మకు అవకాశం ఇచ్చారు. మరో కీలక పోస్ట్.. స్టేట్ ఫర్ సివిలియన్ సెక్యూరిటీ- డెమోక్రసీ- హ్యూమన్ రైట్స్ అండర్ సెక్రటరీగా ఉజ్రా జెయాను నియమించారు.
వైట్‌హౌజ్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా సబ్రినా సింగ్ నామినేట్ అయ్యారు. వైట్‌హౌజ్ డిజిటల్ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్ మేనేజర్‌గా అయేషా షా, జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా సమీరా ఫాజిలీని నియమించారు. ఇక తనతో కలిసి పనిచేస్తున్న వినయ్ రెడ్డికి స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బైడైన్ బాధ్యతలు అప్పగించారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా వేదాంత్ పాటిల్, ప్రెసిడెన్సియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా గౌతమ్ రాఘవన్‌ను నామినేట్ చేశారు. వీరితో పాటు మరో ఏడుగురికి కీలమైన పోస్టులు దక్కాయి.