రష్యా దాడిలో ఉక్రెయిన్ రక్తపు ముద్దగా మారింది. అక్కడి ప్రజల జీవితాలు సమాధులుగామారుతున్నాయి. ఎటుచూసినా శవాలు, శిథిల భవనాలు, బాంబుల మోతలు, బంధీ అయిన బతుకులు. ఇదే ఇప్పుడు ఉక్రెయిన్ ముఖచిత్రం. అక్కడ మాతృభూమి కోసం పోరాడుతున్న సైనికులతో పాటు.. అమాయక పౌరులు, చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. రష్యా చేస్తోన్న ఈ దమనకాండలో ఇప్పటికే 20 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు.
ఈ విషయాన్ని ఉక్రెయిన్ జాతీయ జర్నలిస్టుల యూనియన్ టెలిగ్రామ్ ఛానల్‌లో బుధవారం తెలిపింది. మృతి చెందిన జర్నలిస్టుల పేర్ల జాబితాను కూడా ప్రకటించింది. ఆ జాబితాను ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు ధ్రువీకరించింది. చనిపోయిన రష్యన్ జర్నలిస్ట్ ల లిస్ట్ లో ఒక్సానా బౌలినా, అమెరికన్ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత బ్రెంట్ రెనాడ్, ఐరిష్ కెమెరామెన్ పియర్ జక్ర్జెవ్‌స్కీ, లిథువేనియన్ డాక్యుమెంటరీ చిత్ర దర్శకుడు మాంటాస్ క్వెదరవిసియస్ ఉన్నారు.
అంతేకాకుండా 78 ఏళ్ల ఉక్రేనియన్ జర్నలిస్టుల యూనియన్ సభ్యుడు యెవెన్ బాల్, వీడియో ఇంజనీర్ రోమన్ నెజిబోరెట్స్ కూడా ఉన్నట్టు యూనియన్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా భారీగా ఆయుధాలను పంపిచనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. రష్యాపై ఘాటైన విమర్శలు చేశారు.
ఉక్రెయిన్ లో అమాయక పౌరులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ లో నరమేధం సృష్టిస్తున్నారన్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్ లోని కీవ్ ను, మరియుపోల్ ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతోనే రష్యా దాడులు సాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ నరమేధాన్ని ఇంతటితో ఆపకపోతే పుతిన్ తగిన మూల్యాన్ని చెల్లించుకొవాల్సి వస్తోందని హెచ్చరించారు జో బైడెన్.