జల్లికట్టు పోటీలు ప్రారంభమైన మొదటిరోజే రక్తం చిందింది. తొలిరోజే 20 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గాయపడ్డ వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
తమిళనాడు పుదుకోట్టైలోని తచంకురిచిలో ఆదివారం ఉదయం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత మధ్య రాష్ట్ర మంత్రులు రఘుపతి, మెయ్యనాథన్, జిల్లా కలెక్టర్ కవిత ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ఆటలో గెలుపొందిన క్రీడాకారులకు బైక్ లతో పాటు విలువైన బహుమతులు అందజేయనున్నారు.
అయితే జల్లికట్టు పేరుతో మూగ జీవాలను హింసిస్తున్నారనే ఆరోపణలతో గతంలో ఈ ఆటపై తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ ఆటలో పాల్గొన్నవారిలో కొంతమంది చనిపోతుండగా, చాలా మంది గాయాలపాలవుతున్నారు.
దీంతో జల్లికట్టుపై నిషేధం విధించారు. అయితే జల్లికట్టు ఓ సాంప్రదాయమని సుప్రీం కోర్టు దాక వెళ్లి నిర్వహకులు అనుమతులు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం షరతులతో జల్లికట్టు నిర్వహణకు అనుమతిని ఇచ్చింది.