కొన్ని సందర్భాల్లో మనకు ఓ రెస్టారెంటో, ఓ కేఫ్ లేదా ఒక ప్రదేశమో.. ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎప్పుడూ అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని ఉంటుంది. కొందరు అయితే తమ ఫేవరెట్ ప్రదేశాలకు ఎప్పుడూ వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆ దంపతులు కూడా గత 20 ఏళ్ల నుంచి ఆ రెస్టారెంట్‌కు వెళ్తూనే ఉన్నారు. దాంతో వారికి చక్కని అనుబంధం ఏర్పడింది. అయితే ఇటీవలే ప్రేమికుల దినోత్సవం రోజు మళ్లీ వారు యథావిధిగా ఆ రెస్టారెంట్‌కు వెళ్లారు. కానీ అక్కడి స్టాఫ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు.
అమెరికాలోని షికాగోలో క్లబ్ లక్కీ అనే ఓ రెస్టారెంట్ ఉంది. అక్కడ 20 ఏళ్ల కిందట ఓ వ్యక్తి తన భార్యతో కలిసి మొదటి సారిగా డేట్ కు వచ్చాడు. తరువాత వారు వివాహం చేసుకుని 20 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నారు. అయితే ఆ రెస్టారెంట్‌తో వారికి ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. వారు మొదటిసారిగా అక్కడికే డేట్‌కు వచ్చారు కనుక.. వారికి అది ప్రత్యేకంగా మారింది. దీంతో ప్రతి ఏటా వారు వాలెంటైన్స్ డే రోజున కచ్చితంగా ఆ రెస్టారెంట్‌కు రావడం మొదలు పెట్టారు. అలా 20 ఏళ్ల నుంచి వారు అక్కడికి వస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలోనే వారు ఆ రెస్టారెంట్‌లో ఎప్పుడూ ఫిబ్రవరి 12వ తేదీనే రాత్రి 7.30 గంటలకు బూత్ నం.46కు వచ్చి డిన్నర్ చేసి వెళ్తారు. ఇటీవల అదే తేదీన మళ్లీ ఆ రెస్టారెంట్‌కు ఆ జంట వచ్చింది. అయితే వారు డిన్నర్ చేసినందుకు 137.33 డాలర్లు అయింది. కానీ వారు ఏకంగా 2వేల డాలర్లను అక్కడి స్టాఫ్‌కు టిప్ గా ఇచ్చారు. ఆ మొత్తాన్ని స్టాఫ్ అందరూ పంచుకోవాలని బిల్ పై రాశారు. అలాగే 20 ఏళ్ల నుంచి చక్కని ఫుడ్‌తోపాటు సేవలను అందిస్తున్నందుకు ఆ జంట ఆ రెస్టారెంట్‌కు థాంక్స్ కూడా చెప్పింది. ఈ క్రమంలోనే ఆ జంటకు చెందిన రెస్టారెంట్ బిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బిల్‌ను చూసి నెటిజన్లందరూ షాకవుతున్నారు.