గడిచిన ఐదేళ్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ చెల్లింపులు ప్రతీ ఏడాది 200శాతం పెరుగుతూ వచ్చాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రితేష్ శుక్లా తెలిపారు. UPI చెల్లింపుల వలన సమయం వృధాకాదని.. డబ్బులకు కూడా సెక్యూరిటీ ఉంటుందని.. ఇలాంటి సౌలభ్యాలు ఉండటం వలన దీని వాడకం పెరిగిందని అన్నారు. 2020లో UPI ద్వారా జరిగిన పేమెంట్లు 457 బిలియన్ డాలర్లని తెలిపారు. ఇది దేశ జీడీపీలో 15 శాతం అని శుక్లా చెప్పారు.
2016లో ఈ పోర్టల్ ప్రారంభించినపుడు 6,900 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని.. తరువాత ఏడాది నుంచి దీని విలువ పెరుగుతూ వచ్చిందని అన్నారు. 2017-18లో లక్ష కోట్లకు.. 2018-19లో 8.76 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. 2019-20లో గణనీయంగా పెరిగి 21.3 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగాయన్నారు. ఈ ఏడాది మరో నాలుగు నెలలు మిగిలి ఉండగానే UPI లావాదేవీల విలువ 41 లక్షల కోట్లకు చేరిందని శుక్లా తెలిపారు. కరోనా మహమ్మారి ప్రజల అలవాట్లలో గణనీయమైన మార్పును తీసుకొని వచ్చిందని అన్నారు. UPI లావాదేవీలు కూడా దీనిలో భాగమేనని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులలో UPI చాలా ముఖ్యమైన పాత్ర పోషింస్తుందని తెలిపారు. దేశంలోని 12 కోట్ల మంది వ్యాపారులు దీనిని ఉపయోగిస్తున్నారని శుక్లా చెప్పారు.