2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి మరణ శిక్షను విదిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో మరో 11 మంది కోర్టు జీవిత ఖైదును విధించింది.
ఈ కేసులో ఉస్మాన్ అగర్ బత్తీవాలాను మినహాయించి మిగతా దోషులకు రూ. 2.85 లక్షల జరిమానాను విధించింది. ఉస్మాన్ అగర్ బత్తీ వాలాకు 26కు పైగా నేరాల్లో యూఏపీఏ సహా పలు చట్టాల కింద రూ. 2.88 లక్షలను జరిమానాను విధిస్తున్నట్టు కోర్టు తీర్పులో పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 8 న జరిగిన విచారణ సమయంలో ఈ కేసులో 28 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. అదే సమయంలో 49 మందిని దోషులుగా ప్రకటించింది.
26 జూలై 2008లో అహ్మదాబాద్ నగరంలో 20 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలను కోల్పోయారు. మరో 246 మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ పేలుళ్లపై అహ్మదాబాద్ నగరంలో 35 కేసులను, 20 ఎఫ్‌ఐఆర్ లను, సూరత్ లో 15 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారు. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమంటూ ఉగ్రసంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ ప్రకటించుకుంది.