సినిమా రిలీజైన తర్వాత హిట్ అవ్వొచ్చు, లేదా ఫ్లాప్ కూడా అవ్వొచ్చు. కానీ విడుదలకు ముందే హిట్టయిన సినిమా ఉంటుందా? అసలు అది సాధ్యమేనా? 2018 అనే సినిమా విషయంలో ఇదే నిజమైంది.
మలయాళంలో సూపర్ హిట్టయిన సినిమా 2018. అతి తక్కువ టైమ్ లో 100 కోట్లు ఆర్జించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడీ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను బన్నీ వాస్ తీసుకున్నాడు. శుక్రవారం రిలీజ్ చేశాడు.
అయితే అంతకంటే ముందే మీడియాకు ఆయన ఈ సినిమాను ప్రదర్శించాడు. అంతేకాదు, ఒక రోజు ముందే రివ్యూలు రాసే వెసులుబాటు కూడా కల్పించాడు.
అలా విడుదలకు 24 గంటల ముందే 2018 సినిమాను చూసిన తెలుగు మీడియా, ఈ సినిమాను ఆకాశానికెత్తేసింది. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా హృదయానికి హత్తుకుందంటూ రివ్యూలు పాజిటివ్ గా ఇచ్చింది. రేటింగ్స్ కూడా గట్టిగా పడ్డాయి.
అలా విడుదలకు ముందే హిట్ టాక్ తో, 3ప్లస్ రేటింగ్స్ తో శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది 2018 సినిమా. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ సినిమా కేరళలో సంచలనం విజయాన్ని సాధించింది. అదే మేజిక్ తెలుగులో కూడా రిపీట్ అవుతుందని భావిస్తున్నాడు బన్నీ వాస్. అందుకే ధైర్యంగా విడుదలకు ముందే మీడియాకు షో వేశాడు.