దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా త్రివర్ణ పతకం రెపరెపలాడింది. దేశ అభ్యున్నతికి తమ వంతు కృషి చేస్తామని అంతా ప్రతిజ్ఞ పూనారు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాజ్ పథ్ లో ఆయనకు సాయుధ దళాలు 21 తుపాకులతో వందనం సమర్పించాయి.
రాష్ట్రపతితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు రాజ్ పథ్ కు సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు ప్రధాని నివాళులు అర్పించారు. కరోనా కారణంగా ఈసారి వీక్షకుల సంఖ్యను కుదించారు అధికారులు.
సైనిక దళాల పరేడ్ ను రాష్ట్రపతి వీక్షించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశ సైనిక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా పరేడ్ సాగింది. వాయుసేన విన్యాసాలు, శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యుద్ధ ట్యాంకులు, క్షిపణులను సైన్యం ప్రదర్శించింది. ఇక పరేడ్ సందర్భంగా ఏర్పాటు చేసిన శకటాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
భారత వాయుసేన శకటంతో పాటు కవాతులో పాల్గొన్నారు రఫెల్ ఫైటర్ జెట్ తొలి మహిళా పైలట్ శివాంగి సింగ్. ఈమె ఐఏఎఫ్ శకటం పరేడ్‌లో భాగమైన రెండో మహిళా ఫైటర్ జెట్ పైలట్ గా రికార్డులకెక్కారు. ఇంతకుముందు భావనా కాంత్ పరేడ్ లో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్ గా నిలిచారు.
ఈసారి నౌకాదళ శకటంపై 1946 నాటి నేవీ తిరుగుబాటు అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇక రాష్ట్రాలవారీగా ప్రదర్శించిన శకటాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్నింటిలో హర్యానా శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. క్రీడాకారుల నమూనాతో దీన్ని రూపొందించారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన శకటంపై మహిళలు వెదురు బుట్టలు అల్లుతున్నట్టుగా రూపొందించగా.. గుజరాత్ శకటం అక్కడి గిరిజనుల పోరాట పటిమను చాటి చెప్పేలా ఉంది. గోవా శకటం అక్కడి వారసత్వ చరిత్రను చాటి చెప్పగా.. ఉత్తరప్రదేశ్ శకటంపై స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పనకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించారు. ఇవే కాక అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి.
రాష్ట్రాలతో పాటు వివిధ కేంద్ర శాఖలు కూడా తమ శకటాలను ప్రదర్శించాయి. కేంద్ర విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విశిష్టతను తెలియజేసే రీతిలో ఓ శకటాన్ని రూపొందించింది. మహిళా సాధికారత గురించి తెలియజేస్తూ పోస్టల్ శాఖ కూడా ఓ శకటాన్ని ప్రదర్శించింది. అలాగే ఆధ్యాత్మిక గురువు అరబిందో 150వ జయంతి సందర్భంగా ఆయన విశిష్టత అందరికీ తెలిసేలా ఓ శకటాన్ని ఏర్పాటు చేశారు.
ఇక సరిహద్దు భద్రతా దళానికి చెందిన సీమా భవాని మోటార్‌సైకిల్ బృందం చేసిన విన్యాసాలు అదరహో అనిపించాయి. వారి విన్యాసాలను చూసి అందరూ నిల్చుని చప్పట్లతో అభినందించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన రిపబ్లిక్ డే సంబరాల్లో తొలిసారి భారత వాయుసేనకు చెందిన 75 విమానాలతో విన్యాసాలు నిర్వహించారు. పాత వాటితోపాటు ఆధునిక ఎయిర్ క్రాఫ్ట్ లు, రఫెల్, సుఖోయ్, జాగ్వర్ తో గగనతలంలో చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.
తొలిసారిగా భారత వాయుసేన కాక్ పిట్ నుంచి వీక్షణను అందించింది. గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా కాక్ పిట్ నుంచి చిత్రీకరించిన వీడియోలను ప్రదర్శించింది. ఇలా ఆకాశంలో విన్యాసాల మధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం కావడం ఇదే తొలిసారి.
Goosebumps!! To see the might of our Indian Air Force… leaves you spellbound. Wishing everyone a Happy Republic Day with a proud heart. Jai hind 🇮🇳 pic.twitter.com/HHZWo0VxXU
— Akshay Kumar (@akshaykumar) January 26, 2022
Advertisements
మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కీలక కూడళ్లలో పోలీసులు వాహనాలను తనిఖీ నిర్వహించారు. దాదాపు 30వేల మందికి పైగా భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఉగ్ర హెచ్చరికల నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నారు.