బంగారం స్మగ్లర్లు చాలా తెలివి మీరిపోయారు. రకాలక పద్ధుతుల్లో బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా చాక్లెట్ పౌడర్ రూపంలో రవాణా చేస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. తమిళనాడు తిరుచిరాపల్లిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చాక్లెట్ పౌడర్ రూపంలో ఉన్న 211 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు రూ.21.55 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.
ఆదివారం ఎయిరిండియా విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీ చేశారు. అయితే అతని నుంచి చాక్లెట్ పౌడర్ లో బంగారం పౌడర్ ను కలిపి మూడు చాక్లెట్ పౌడర్ డబ్బాలను అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుడి చెక్ ఇన్ బ్యాగేజీ నుంచి 175 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సాక్సుల్లో బంగారం దాచుకుని విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీలు చేశారు.అతని వద్ద బంగారం దొరకలేదు. అయితే అతని షూ విప్పమని అడగ్గా కాస్త ఆలస్యం చేయడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది.
దీంతో సాక్సులను చెక్ చేయగా అతన వద్ద పుత్తడి ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని నుంచి 957 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు 46లక్షల 53 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.