కేరళకు చెందిన ఓ యువతిపై బెంగుళూరులో సామూహిక అత్యాచారం జరిగింది. మద్యం సేవించి ఉన్న ఈమె ఈ నెల 26 వతేదీ రాత్రి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని ఇంటికి బయలుదేరగా ఆ బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగరంలోని ఎలెక్ట్రానిక్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి బైక్ రైడర్ షహబుద్దీన్, అతని మిత్రుడు అక్బర్ సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
22 ఏళ్ళ ఈమె మద్యం మత్తులో ఉన్న విషయాన్ని గమనించి షహబుద్దీన్ తన స్నేహితుడు అక్బర్ కి ఫోన్ చేశాడని, ఆమెను ఆమె ఇంటివద్ద దింపకుండా నీలాద్రి నగర్ లోని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిసింది.
ఈ అమానుషంలో మరో మహిళ కూడా నిందితులకు సహకరించిందని, విషయం బయట పడకుండా కట్టుకథలు అల్లడానికి యత్నించిందని నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
27 న ఒంటినొప్పులతో బాధ పడుతున్న బాధితురాలు మెడికల్ చెకప్ కోసం వెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగినట్టు తెలిసిందన్నారు. ఆమె ఫిర్యాదుపై పోలీసులు వెంటనే దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసినట్టు ఆయన చెప్పారు. అక్బర్ అనే నిందితుడు మొబైల్ స్టోర్ లో పని చేస్తున్నట్టు తెలిసిందన్నారు. వీరిలో ఒకరికి గతంలో కొన్ని క్రిమినల్ కేసులతో ప్రమేయం ఉన్నట్టు ప్రతాప్ రెడ్డి తెలిపారు.