– సిరిసిల్లలో బీజేపీ నేతల అరెస్టులు
– రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే..
– ఒక్క బీజేపీ వాళ్లపైనే కేసులు, అరెస్టులా?
– ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం?
– ప్రభుత్వంపై కమలనాథుల ఆగ్రహం
సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం టార్గెట్ చేసిందా? కావాలనే అరెస్టుల పర్వం కొనసాగుతోందా? ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే బీజేపీ వాళ్లనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం దేనికి సంకేతం? కమలం గూటి నుంచి ఇవే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జిల్లాలో తమ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక.. అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు బీజేపీ నేతలు.
సోషల్ మీడియాలో పోస్టుల కారణంగా శుక్రవారం రాత్రి టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 23 మంది బీజేపీ నాయకులను పోలీసులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సిరిసిల్ల ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అరెస్ట్ అయిన వారిని విచారించిన న్యాయమూర్తి.. పోలీసులు సరైన నిబంధనలు పాటించలేదని రిమాండ్ కు నిరాకరించారు. అయితే.. శనివారం అర్ధరాత్రి తర్వాత మళ్లీ నిబంధనలు పాటిస్తూ బీజేపీ నాయకులను రిమాండ్ కు తరలించారు.
ఈ ఘటన బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మంత్రి గంగుల కమలాకర్ అయితే.. ఏకంగా బీజేపీ నేతల ఉనికే లేకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ బలం ముందు బీజేపీ బలం చాలా చిన్నదని వార్నింగ్ ఇచ్చారు. అటు దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు లేకుండా బీజేపీ వాళ్లపై నమోదు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పైగా దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లకు వెళ్లి మంత్రులు పరామర్శించడమేంటి? అంటూ మండిపడ్డారు.
దాడి చేసిన వారి ఇళ్లకు మంత్రులు వెళ్తుంటే.. బాధితులైన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన తమ నాయకులను అరెస్ట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగితే ఒక్క బీజేపీ నేతలనే అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.