పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ దేశ విపక్షం ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై పాక్ పార్లమెంటులో త్వరలోనే ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కీలక తరుణంలో ఇమ్రాన్ కు ఆయన సొంత పార్టీ నేతలే షాకిచ్చారు.
ఇమ్రాన్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అంతేకాకుండా మరో ముగ్గురు మంత్రులు కూడా పదవులకు రాజీనామా చేయడంతో.. ఇమ్రాన్ సర్కారు ఒక్కసారిగా ప్రమాదంలో పడిపోయింది.
ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 172 సీట్ల మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంటోంది. దిగువ సభలో ప్రభుత్వానికి 155 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు 20 సీట్లు కలిగిన నాలుగు మిత్రపక్షాలతో కలిసి ఇమ్రాన్ ప్రభుత్వం 175 సీట్లను కలిగి ఉంది.
ఇప్పుడు రాజీనామా చేసిన 27 మందిని తీసేస్తే.. ఇమ్రాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్టే. దీంతో ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ఒప్పుకుంటారా..? లేదంటే అంతకంటే ముందుగానే పదవికి రాజీనామా చేస్తారా..? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.