దేశ రాజధాని ఢిల్లీలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఢిల్లీలో నెల రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 రోజుల్లో 42 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
2012 తర్వాత దేశ రాజధానిలో ఈ స్థాయిలో ఎండలు మండి పోవడం ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ ఏడాదిలో ఢిల్లీలో దాదాపు 30 రోజుల పాటు 42 లేదా అంత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.
2010లోనూ 35 రోజుల పాటు ఎండలు మండినట్టు ఐఎండీ వివరించింది. అయితే అతి తక్కువగా 2021లో కేవలం ఆరు రోజులు, 2020లో మూడు రోజులు మాత్రమే ఎండలు ఉన్నాయని తెలిపింది.
2019లో 16, 2018లో19, 2016, 2017లో 15 రోజులు, 2015 లో 18 , 2014లో 15 , 2013లో 17 రోజుల పాటు 42 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే 1953, 1953, 1971 సంవత్సరాల్లో వాతావరణ సమాచారం లేదు. ఈ ఏడాదిలో ముందుగానే ఎండలు వచ్చేశాయి.
మార్చి, ఏప్రిల్ నెలలోనే భానుడు నిప్పుల వర్షం కురిపించాడు. 1951 తర్వాత ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. దేశరాజధానిలో ఈ సారి ఆరుసార్లు హీట్‌వేవ్ వచ్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. మే నెల మధ్యలో అత్యధికంగా 49 డిగ్రీల వరకు నమోదైనట్టు తెలిపారు. పశ్చిమ వేడి గాలుల వల్ల ఢిల్లీలో ఇంకా ఎండలు మండిపోతున్నాయి.