త్రిపురలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. రాష్ట్రంలో 25 నియోజక వర్గాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మరో 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇది ఇలా వుంటే రాజధాని అగర్తలాలో బీజేపీకి షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ విజయం సాధించారు.
బీజేపీ అభ్యర్థి పాపియా దుత్తాను ఆయన చిత్తుగా ఓడించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడు సమీర్ రంజన్ దాస్ కుమారుడైన బర్మన్ మొదట కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు.
1993లో మొదటి సారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి న్రిపేణ్ చక్రవర్తి చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఆ తర్వాత 1998 ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరగలేదు.
2016లో సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. దీంతో పొత్తులను వ్యతి రేకిస్తూ ఆయన పార్టీని వీడారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడి బీజేపీలో చేరారు. 2018లో బీజేపీ తరఫున పోటీ చేసి అగర్తలా నుంచి గెలుపొందారు. దీంతో ఆయనకు పార్టీ మంత్రి పదవిని కట్టబెట్టింది.
ఆ తర్వాత కొన్ని నెలలకే ఆరోపణలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరోసారి విజయం సాధించారు.