పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 27 ఏళ్లు అయ్యింది. ఈయన తొలి సినిమా 1996లో విడుదలైంది. తమ్ముడిని హీరోగా నిలబెట్టడానికి చిరంజీవి చాలా ప్రయత్నాలు చేసాడు. ఆయన కృషి ఫలించి ఈ రోజు పవర్ స్టార్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అయితే ఈయన కెరీర్‌లో మాత్రం ఓ ఏడాది చాలా ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ ఒక్క ఏడాది కానీ పవన్ కెరీర్‌లో లేకపోయుంటే ఈ రోజు పవర్ స్టార్ ఇమేజ్ ఇలా ఉండేది కాదేమో..? అంత స్పెషల్ ఇయర్ ఒకటుంది.. అదే 1998.
ఆ ఏడాది రెండు సంచలన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి పవర్ స్టార్ అని నిరూపించుకున్నాడు పవన్. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్.. 1997లో గోకులంలో సీత సినిమాలో నటించాడు. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్ద విజయాలేం కావు.. జస్ట్ ఓకే అనిపించాయంతే.
గుర్తింపు అయితే తీసుకొచ్చాయి కానీ పవన్ కోరుకున్న ఇమేజ్ మాత్రం రాలేదు. అలాంటి సమయంలో 1998 పవన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ ఏడాది ఈయన చేసిన రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. దాంతో తిరుగులేని హీరోగా నిలబడ్డాడు పవన్. అందులో ఒకటి భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించగా.. మరొకటి కరుణాకరణ్ తెరకెక్కించాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన లవ్ టుడే సినిమాను తెలుగులో సుస్వాగతం పేరుతో రీమేక్ చేసాడు భీమినేని. పవన్ ఇమేజ్‌కు సరిపోయేలా కాసిన్ని మార్పులు చేసి తీసుకొచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 1998, జనవరి 1న విడుదలైన సుస్వాగతం బ్లాక్‌బస్టర్ అయింది. అందులో డైలాగులు ఇప్పటికీ ఫేమస్సే. ప్రకాశ్ రాజ్ చేసిన మోనార్క్ కారెక్టర్ సినిమాకు మరో హైలైట్. ఈ సినిమా ఓపెనింగ్‌కు బాలకృష్ణ అతిథిగా వచ్చాడు.
ఇక ఇదే ఏడాది కొత్త దర్శకుడు కరుణాకరణ్ తెరకెక్కించిన తొలిప్రేమ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. జులై 24 ఈ సినిమా విడుదలైన ఈ సినిమా అప్పట్లో యూత్‌కు పిచ్చెక్కించింది. ఒక్కొక్కరు ఈ సినిమాను పదేసి సార్లు చూసారంటే అతిశయోక్తి కాదేమో..? సున్నితమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను కరుణాకరణ్ తెరకెక్కించాడు. సుస్వాగతం, తొలిప్రేమ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ వెంటనే వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషీ సినిమాలతో టాప్ హీరో అయిపోయాడు పవర్ స్టార్.