దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపించింది. సెకెండ్ వేవ్ విజృంభణ తర్వాత తొలిసారిగా 25వేలకు దిగివచ్చాయి రోజువారీ కేసులు. గత 24 గంటల్లో 15,63,985 మందికి పరీక్షలు జరపగా.. 25,166 మందికి పాజిటివ్ అని తేలింది. ఆదివారంతో పోల్చితే కేసులు 23.5 శాతం మేర తగ్గాయి.
కొత్తగా 437 మంది కరోనాతో చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 4,32,079కి చేరింది. అలాగే ఇప్పటిదాకా కరోనా బారినపడినవారి మొత్తం సంఖ్య 3.22 కోట్లకు పెరిగింది. ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు 3,69,846గా ఉన్నాయి.
రికవరీ రేటు 97.51 శాతానికి చేరింది. తాజాగా 36,830 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం 88,13,919 మందికి టీకా వేశారు. ఇప్పటిదాకా 55.47 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించింది కేంద్రం.