గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సెలబ్రిటీలు, సామాన్యులు సహా అనేక మంది అకాల మృత్యువాత పడుతున్నారు. పట్టుమని పాతికేళ్లు లేని వారు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ యంగ్ ఫాఫ్ట్ వేర్ ఇంజినీర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. థియేటర్ లో సినిమా చూస్తూ.. హాట్ ఎటాక్ తో కుప్ప కూలాడు.
డీటైల్స్ లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర మండలం బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన మురళీ కృష్ణ(26) అనే యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మురళి, ఫ్రెండ్స్ తో కలిసి సినిమా చూడటం కోసం థియేటర్ కు వెళ్లాడు.
అలా మూవీ చూస్తూండగానే సడెన్ గా గుండెల్లో ఇబ్బందిగా అనిపించింది. తనకు ఏమవుతుందో అర్థం అయ్యేలోపే.. కూర్చున్నచోటనే కుప్ప కూలాడు మురళీ. ఇది గమనించిన స్నేహితులు అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే మార్గమధ్యలోనే అతడు తుది శ్వాస విడిచాడు. చేతికి అంది వచ్చిన కొడుకు హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మురళీ కృష్ణకు ఎలాంటి దుర అలవాట్లు లేవని.. ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటాడని.. ఇప్పటి వరకూ అనారోగ్య సమస్యలు కూడా లేవని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు.