విదేశాల్లోని దాదాపు 276 మంది భారతీయులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వారిలో 255 మంది ఇరాన్ లో ఉండగా..12 మంది యు.ఎ.ఇ, 5 గురు ఇటలీలో, హాంగ్ కాంగ్, కువైట్, రువాండ, శ్రీలంక లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు ప్రభుత్వం బుధవారం లోక్ సభలో వెల్లడించింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.
నాలుగో దశలో సోమవారం ఇరాన్ నుంచి 53 మంది భారతీయులను స్వదేశానికి తరలించామని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కరోనా తీవ్రంగా ఉన్న ఇరాన్ నుంచి 389 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇరాన్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 700 మంది వైరస్ కు బలయ్యారు. 14 వేల మందికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ దేశంలో చిక్కుకున్న వారిని భారత ప్రభుత్వం దశల వారీగా స్వదేశానికి తరలించింది.