తమిళనాడు తిరుపూర్ లోని అనాధ బాలుర షెల్టర్ హోమ్ లో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముగ్గురు బాలురు మరణించారు. 11 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వీళ్ళలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఇక్కడి వివేకానంద అనాధ బాలుర శరణాలయంలో జరిగింది ఈ ఘటన. రాత్రి డిన్నర్ లో రసంతో కలిపిన అన్నం, లడ్డూ తిన్న వీరు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు.
పరిస్థితి సీరియస్ గా మారడంతో వీరిని గురువారం ఉదయం మొదట ప్రైవేటు హాస్పిటల్ కి , అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 8-13 ఏళ్ళ మధ్యవయసున్న ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు.
11 మందిలో కొందరు ఐసీయూలో ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం తెలిసిన వెంటనే తిరుపూర్ జిల్లా కలెక్టర్ ఎస్.వినీత్ ఆసుపత్రిని సందర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. షెల్టర్ హోమ్ లో ఈ బాలురికి పెట్టిన ఫుడ్ శాంపిల్స్ ని పరీక్షలకు పంపాలని ఆయన ఆదేశించారు,
ఫుడ్ పాయిజనింగ్ పై విచారణ జరుగుతుందని, ఇందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ హోమ్ నిర్వాహకులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు, చిల్డ్రన్ ప్రొటెక్షన్ యూనిట్ సభ్యులు కూడా ఎంక్వయిరీ చేస్తున్నారు.