టర్కీ, సిరియా దేశాలు మళ్ళీ భూకంపంతో వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై 6.4 మ్యాగ్నిట్యూడ్ తో సంభవించిన భూకంపంలో ముగ్గురు మరణించగా 200 మందికి పైగా గాయపడ్డారు. సుమారు రెండు వారాల క్రితమే వచ్చిన భూకంపంలో వేలమంది మృతి చెందగా తాజాగా సోమవారం తిరిగి ఈ పెను విలయం ఈ దేశాలను కకావికలం చేసింది.
ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న కొన్ని భవనాలు దీంతో పూర్తిగా నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. భూకంప కేంద్రం టర్కీ లోని హత్యా ప్రావిన్స్ లో గల డెఫ్నీ టౌన్ లో కేంద్రీకృతమైనట్టు గుర్తించారు.
ఈ నెల 6 న సంభవించిన భూకంపం ఈ రెండు దేశాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించగా పొరుగునున్న జోర్దాన్, సైప్రస్, ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల్లో కూడా పెను ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలు పై మొదట దీని తీవ్రతను 7.8 గా, ఆ తరువాత రెండోసారి వచ్చిన ప్రకంపనలను 5.8 గా నమోదు చేశారు.
తాజాగా సంభవించిన భూకంపంలో ముగ్గురు మృతి చెందారని, 213 మంది గాయపడ్డారని టర్కీమంత్రి సులేమాన్ సోయులు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్నవారిని సహాయక బృందాలు రక్షిస్తున్నాయన్నారు. సిరియాలోని అలెప్పోలో సుమారు 130 మంది గాయపడినట్టు వైట్ హెల్మెట్స్ అనే సివిల్ డిఫెన్స్ సంస్థ వెల్లడించింది. అయితే వీరికి ప్రాణాపాయం లేదని ఈ సంస్థ పేర్కొంది.