తెలుగు రాష్ట్రాల్లో కరోనా టీకా అనంతర మరణాలు కలవరపెడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే వ్యాక్సిన్ వేయించుకున్న ముగ్గురు ఆరోగ్య కార్యకర్తలు మరణించడం చర్చనీయాంశంగా మారింది. వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటి రోజే (జనవరి 20) నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 42 ఏళ్ల ఆరోగ్య కార్యకర్త మృతి చెందారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్లే ఆయనకు చెస్ట్ పెయిన్ వచ్చినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా వ్యాక్సినేషన్ తర్వాత నమోదైన తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం ఇదే.
ఇక ఆదివారం టీకా తీసుకున్న మరో ఇద్దరు హెల్త్ వర్కర్లు మృతి చెందారు. వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట అంగన్‌వాడీ టీచర్ తీవ్రమైన చాతినొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటి నుంచి ఆమె అస్వస్థతగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. అటు ఏపీలో గుంటూరులో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశా కార్యకర్త కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె కూడా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాతే అనారోగ్యానికి గురైనట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్‌కు గురైనట్టు తేల్చారు.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు వరుసగా ఇలా మరణాల బారినపడుతుండటతో.. వాటి పనితీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోవడానికి ముందు అందరిలోనూ తలనొప్పి, చాతినొప్పి వంటి కామన్ సింప్టమ్స్ కనిపించడం ఆ సందేహాలకు బలాన్నిస్తున్నాయి. అయితే ప్రభుత్వం, వైద్యులు మాత్రం వ్యాక్సినేషన్‌కు, వారు మరణించడానికి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.