మొన్నటివరకు గాసిప్ అనుకున్నది నిజమైంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో సినిమా లాక్ అయింది. పక్కా కమర్షియల్ మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించబోతున్నారు.
సలార్ పార్ట్-1 రిలీజై, పార్ట్-2 పట్టాలపైకి వచ్చే గ్యాప్ లో మారుతి దర్శకత్వంలో ఈ సినిమా పూర్తిచేయాలనేది ప్రభాస్ టార్గెట్. దీనికి రాజా డీలక్స్ అనే పేరు అనుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఇదొక రొమాంటిక్ మూవీ. ప్రభాస్ హగ్గులు, ముద్దులు ఇందులో చాలా ఎక్కువ ఉంటాయట. ఈ రొమాంటిక్ కామెడీ స్టోరీ కోసం ముగ్గురు హీరోయిన్లను తీసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్లు ఎవరనే విషయాన్ని మేకర్స్ నిర్థారించనప్పటికీ.. ఒక హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా పేరు గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ యమ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్ సినిమా పూర్తిచేసిన ఈ హీరో, ఈ నెల్లోనే రాధేశ్యామ్ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాడు. సలార్, ప్రాజెక్ట్-K సినిమాల్ని సెట్స్ పైకి తెచ్చాడు. ఇటు మారుతి, గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మే 20న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.