‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంది. ఈ సినిమా వల్గర్ గా ఉందని, కేవలం ప్రచారానికి మాత్రమే పనికి వచ్చేదని గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా జ్యురీ హెడ్, ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ నదవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సహా అనేకమంది సెలబ్రిటీలు, చివరకు ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి కూడా ఆయన చేసిన కామెంట్స్ కి ఇండియాకు క్షమాపణ చెబుతున్నానని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల అనంతరం లాపిడ్ తన కామెంట్స్ కి అపాలజీ చెప్పారు.
మొదట జ్యురీ బోర్డు సభ్యుల్లో ఒకరైన సుదీప్తో సేన్.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ జ్యురీలోని ముగ్గురు సభ్యులు.. అమెరికన్ ప్రొడ్యూసర్ జింకో గొటో, ఫ్రెంచ్ ఫిల్మ్ ఎడిటర్ పాస్కెల్ చావన్స్, ఫ్రెంచ్ డాక్యుమెంటరీ దర్శక నిర్మాత జేవియర్ అంగులో బార్చరన్ .. లాపిడ్ వ్యాఖ్యలకు తమ మద్దతు తెలిపారు.
తాము ఈ సినిమాకు సంబంధించి రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం లేదని, ‘కళాత్మకంగా’ స్పందిస్తున్నామని, కానీ పాలిటిక్స్ కోసం ఓ చలన చిత్రోత్సవ వేదికను ఉపయోగించుకుంటున్నారని వారు విమర్శించారు. . పైగా లాపిడ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, దీన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఇది అసలు జ్యురీ ఉద్దేశమే కాదన్నారు. ఈ మేరకు వీరు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. అయితే వీరిలో గొటో పోస్ట్ చేసిన ట్విటర్ అకౌంట్ ను వెరిఫై చేయాల్సిఉందని విశ్లేషకులు తెలిపారు. . ఇందులో సుదీప్తో సేన్ పేరును కూడా ఈ ముగ్గురూ ప్రస్తావించలేదు. దీంతో సేన్ స్పందిస్తూ.. వీరిప్పుడు దేశంలో లేరని, ప్రస్తుతం తనీ దేశంలో ఉన్నప్పటికీ తన పేరును ఈ స్టేట్మెంట్ లో చేర్చలేదన్నారు. వీరి అభిప్రాయం జ్యురీ బోర్డు నిర్ణయం కాదని, ఒకవేళ ఇది బోర్డు ఏకగ్రీవ నిర్ణయమే అయితే నా పేరును ఇందులో ఎందుకు చేర్చలేదని ఆయన ప్రశ్నించారు.