కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా కింద పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా… మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మృతుల్లో ఒకరు 29 ఏళ్ల మధు (డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్)… మరొకరు 34 ఏళ్ల కృష్ణ (శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్) ఉన్నారు. 60 ఏళ్ల చంద్రన్… స్టాఫర్‌గా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతోంది.
ప్రమాద ఘటనతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. చెన్నై శివార్లలోనే ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అక్కడే షూట్ చేస్తున్న సమయంలో భారీ క్రెయిన్ పడిపోయింది. పక్కనే కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర శంకర్ ఉన్నాడు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాద ఘటనపై కమల్ హాసన్ స్పందించారు. ముగ్గురు ఆప్తులను కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారితో కలిసి బాధను పంచుకుంటానని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.