అసోంను జపనీస్ ఎన్ సెఫలైటీస్ (బ్రెయిన్ ఫీవర్) వణికిస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 297 జపనీస్ ఎన్ సెఫలైటీస్ కేసులు నమోదయ్యాయి.
తాజాగా మరో ముగ్గురు ఈ వ్యాధి బారిన పడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 47 మంది మరణించారు. రాష్ట్రంలో తాజాగా మరో ఏడు కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
తాజా కేసుల్లో జోర్హాట్ జిల్లాలో రెండు, బొంగైగావ్ , దర్రాంగ్, చరైడియోదిబ్రూగర్, కోక్రాజార్ జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 35 లో 32 జిల్లాల్లో జపనీస్ ఎన్సెఫాలిస్ వ్యాధి వ్యాపిస్తోంది. డిమా హసావో, కర్బీ అంగ్లాంగ్, దక్షిణ సల్మారా జిల్లాల్లో ఇప్పటి వరకు ఎన్ సెఫలైటీస్ కేసులు నమోదు కాకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
అత్యధికంగా నాగావ్ జిల్లాలో 44, ఆ తర్వా జోర్హాట్ జిల్లాలో 39 , గోలాఘాట్ జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో అసోంలోని మొత్తం తొమ్మిది వైద్య కళాశాల్లలో, 10 జిల్లా ఆస్పత్రుల్లో ఐసీయూ, టెస్టింగ్ సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.