మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్ నాథ్ షిండే శిబిరంలో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం అక్కడ 42 మంది వరకు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కొత్తగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా గురువారం ఉదయం ముంబై నుంచి గౌహతి చేరుకున్నారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం తమపై చర్యలు తీసుకోకుండా 37 మంది ఎమ్మెల్యేల మెజార్టీని నిరూపించుకునేందుకు షిండే సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఇప్పుడు అసోంలోని గౌహతి ర్యాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్నారు.
అయితే.. శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ ముందు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అసోం సీఎం మహారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు మద్దతుగా ఉంటూ.. స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు టీఎంసీ కార్యకర్తలు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు అసోం మంత్రి అశోక్ సింఘాల్.. ర్యాడిసన్ బ్లూ హోటల్ కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. శివసేన ఎమ్మెల్యేలను కలవడానికే ఆయన అక్కడకు వెళ్లారా? లేక ఇంకేదైనా పని ఉండి వెళ్లారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.