జమ్మూ కశ్మీర్ లోని కుప్వారాలో మంచుతో కప్పేసిన లోతైన గోతిలో పడి ఓ సైనికాధికారితో సహా ముగ్గురు మృతి చెందారు. ఈ జిల్లాలోని మఛాల్ సెక్టార్ లో నిన్న సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో వీరు గస్తీ నిర్వహిస్తుండగా వీరి వాహనం మంచుతో కప్పేసిన గోతిలోకి జారి పడిపోయింది.
వీరి మృతదేహాలను బయటకు తీసినట్టు నార్తర్న్ కమాండ్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ నెల 10,11, 12 తేదీల్లో జమ్మూ కశ్మీర్ లో తీవ్రమైన శీతల వాతావరణం ఉంటుందని, విపరీతంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీనగర్ లో నిన్న 0.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు కాగా బుధవారం కనీస ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెల్సియస్ నమోదయింది.
దీనికి తోడు అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. కుప్వారాలో 0.7 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అనేక చోట్ల మంచు దుప్పటి దట్టంగా పరుచుకుపోవడంతో ఎక్కడ గోతులున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ముగ్గురు సైనికులు ఇలా లోతైన గోతిలో పడి ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారని సైనిక వర్గాలు తెలిపాయి. వీరి మృతికి సైనికాధికారులు తీవ్ర సంతాపం తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియలేదు.