ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వంద ఎకరాల్లో 5 లక్షల మందితో ఈ సభ జరగనుంది. బందోబస్తు కోసం 4,198 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాల అనంతరం ఖమ్మం సభకు జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ చేరుకుంటారు.
ఖమ్మం సభలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , కేరళ సీఎం విజయన్, ఎస్పీ అధినేత అఖిలేశ్, సీపీఐ నేత రాజా నగరానికి చేరుకున్నారు. వీరితోపాటు రైతు ప్రతినిదులు కూడా వచ్చారు. వీరంతా బుధవారం ఉదయం ప్రగతిభవన్ కు వెళ్లారు.
జాతీయ నేతలకు సీఎం కేసీఆర్ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. దీని తర్వాత అందరూ కలిసి యాదాద్రి బయలుదేరి వెళ్లారు. అక్కడ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటనకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
యాదాద్రి టూర్ తర్వాత ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభం, కంటివెలుగు కార్యక్రమంలో పాల్గొననున్నారు నేతలు. ఆ తర్వాత ఖమ్మం సభకు వెళ్తారు.