కేసులు పెరగడమే కాదు.. దేశంలో కరోనా మరణాలు కూడా మళ్లీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 275 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఉన్నట్టుండి వైరస్ ప్రమాద తీవ్రత ఇంతలా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో కొత్త వేరియంట్ ఉండొచ్చన్న అనుమానం కలుగుతోంది.ఇప్పటివరకు కేవలం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు, అలాగే వారితో కాంటాక్ట్ అయినవారికి మాత్రమే కొత్త వెరియట్ టెస్టులు చేస్తున్నారు. కానీ పరిస్థితి చూస్తోంటే.. అవుట్ ఆఫ్ బాక్స్ ఆ కొత్త వైరస్ వెళ్లిపోయినట్టుగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపై నిర్వహించే టెస్టుల్లో బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ రకాలు ఉన్నాయేమో గుర్తించాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కొత్తగా 47,262 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. నిన్న 23,907 మంది కోలుకున్నారు.
దేశంలో మొత్తం కేసులుః 1,17,34,058
రికవరీ అయినవారుః 1,12,05,160
యాక్టివ్ కేసులుః 3,68,457
కరోనా మరణాలుః 1,60,441
వ్యాక్సిన్ వేయించుకున్నవారుః 5,08,41,286
దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10.25 లక్షల మందికి కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 23. 64 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.