– దొరికినంత దోచుకోవడమే!
– రెండేళ్లలో మూడు వందల కోట్లు
– వెయ్యి కోట్ల టార్గెట్ గా అక్రమాలు
– టైటిల్ లేకుండానే విక్రయాలు
– అనుమతులు లేకుండానే పనులు
– హైదరాబాద్ అక్రమ సంపాదనంతా ఆంధ్రాకు!
– పైసల కోసం ప్రభుత్వ భూమినే అమ్ముతున్న ఘనులు
– భారతి బిల్డర్స్ భూ బాగోతం పార్ట్-1
క్రైంబ్యూరో, తొలివెలుగు:విజయవాడ నుంచి కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చారు. మాయమాటలు చెప్పి, మంది సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పైసా పెట్టుబడి పెట్టకుండానే రెండేళ్లలో మూడు ప్రాజెక్టుల్లో మూడు వందల కోట్లు లేపేశారంటేనే ఎంత ఘనులో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాజెక్ట్ చరిత్ర చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. మోసం చేయడంలో సాహితీ కన్ స్ట్రక్షన్స్ ను మించిపోయారు. తమది కాని భూమిని ఆఫర్స్ పెట్టి మరీ అమ్మేస్తున్నారు. తేడా వచ్చిందని వెబ్ సైట్ లో ఆఫీస్ ఆడ్రస్ ను మార్చేశారు. ప్రీలాంచ్ ఆఫర్స్ అని ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రైవేట్ లో పెట్టేశారు. మోసాలకు ఎలా పాల్పడుతున్నారో చెప్పే కామెంట్స్ ను డిలీట్ చేశారు. నాలుగు గోడల మధ్య నిర్మాణాలు, టవర్స్ , బ్లాక్ లు అంటూ 70 ఎంఎం సినిమా చూపిస్తున్నారు. తీరా కాలం దగ్గర పడుతుండటంతో కొత్త కొత్త వేషాలు వేస్తున్నారు. ఇవన్నీ భారతి కన్ స్ట్రక్షన్స్ గురించి కొందరు కస్టమర్లు చెబుతున్న మాటలు.
కొంపల్లిలో కొంపలు ముంచారు
భారతి బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ను 2021 ఏప్రిల్ లో ఏర్పాటు చేశారు. కొంపల్లిలోని సర్వే నెంబర్ 118, 119లోని ఆరున్నర ఎకరాలకు అప్పట్లో అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. భూమి విలువ మొత్తం రూ.42 కోట్లు. దీనికోసం సేల్ అగ్రిమెంట్ పేపర్స్ ను ఓ ఫైనాన్సర్ వద్ద తనఖా పెట్టి రూ.40 కోట్లు తీసుకున్నారని సమాచారం. ఆ సొమ్ముతోనే రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్లీ అదే మార్వాడీ ఫైనాన్సర్ వద్ద తనఖా పెట్టారని తెలుస్తోంది. నెలనెలా రూ.50 లక్షలు వడ్డీ చెల్లించాల్సి రావడంతో ప్రీ లాంచ్ పేరుతో 300 మంది వద్ద నుంచి సింగిల్ పేమెంట్ అంటూ రూ.100 కోట్లు రాబట్టారని సమాచారం. ఈ సొమ్ముతో మరో చోట భూములకు అడ్వాన్స్ లు ఇచ్చారని, మార్కెటింగ్ వారికి భారీగా కమిషన్స్ ఇచ్చి కస్టమర్స్ కు పార్టీలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
అసలు కథ ఇప్పుడే మొదలైంది
కాలం గిర్రున తిరిగే సరికి రెండేండ్లు పూర్తయింది. 36 నెలల్లోనే పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్ పునాదులు కూడా తీయలేదు. దీంతో కస్టమర్స్ నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. అనుమతుల కోసం అప్లై చేశారు. కానీ, ఒరిజినల్ పేపర్స్ అన్నీ ఫైనాన్సర్ చేతిలో ఉండటంతో హెచ్ఎండీఏ అనుమతులు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పనులు మొదలు పెట్టారని, ఆ పనిని చూపించి కొత్త కస్టమర్స్ వద్ద డబ్బులు లాగేస్తున్నారని కొంతమంది చర్చించుకుంటున్నారు.
45 రోజుల్లో అయితే.. చదరపు అడుగు రూ.4 వేలు, బ్యాంకు లోన్ అయితే రూ.6 వేలు, సింగిల్ పేమెంట్ అయితే పాత కస్టమర్స్ రీ సెల్ కు ఉందంటూ బురిడీ కొట్టిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికీ రూ.3,500 కైనా ఇచ్చేస్తామంటున్నారని చెబుతున్నారు. భారతీస్ లేక్ వ్యూ టవర్స్ పేరుతో కొంపల్లి సినీ ప్లానెట్ రోడ్డులో పట్టపగలే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని కొందరు కస్టమర్లు వాపోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆలస్యంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారికి సొమ్ము సెటిల్మెంట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎలాంటి అనుమతులూ లేకుండానే 10 అంతస్తులతో 6 బ్లాక్ లు 605 ప్లాట్లు అంటూ చీటింగ్ చేస్తున్నారని అంటున్నారు.
భారతి బాగోతం ఒడవని ముచ్చట
వెయ్యి కోట్లు వసూలు చేసి చిప్పకూడు తిన్నా ఫర్వాలేదనుకునే బ్యాచ్ ఈ భారతి బిల్డర్స్ అని కొందరు కస్టమర్లు ధ్వజమెత్తుతున్నారు. అందుకే పుప్పాలగూడలోని కాందిశీకుల భూములను కూడా చెరబట్టారని, ఐఏఏస్ అరవింద్ కుమార్ తమ విందుకు హాజరవుతారని చెప్పుకుని అమ్మకాలు ప్రారంభించారని మండిపడుతున్నారు. భానూర్ లో భారీగానే కొట్టేశారు. వెలిమలలో వెలకట్ట లేకుండానే ముంచేస్తున్నారు. ప్రతీ ప్రాజెక్ట్ పై పూసగుచ్చినట్లు ఇకపై వరుస కథనాలు ఇవ్వబోతోంది తొలివెలుగు