దురాచారానికి ‘సమాధి’ కట్టి.. కుల వివక్షను ‘వెలి’ వేశారక్కడ ! సమాజానికి పట్టిన ‘కుల గజ్జి’ కి పాతర వేశారక్కడ ! తమిళనాడులో జరిగిన ఓ ఉదంతం.. అద్భుత ఘట్టానికి తెర తీసింది. జనవరి 1 వైకుంఠ ఏకాదశి నాడు వరదరాజ పెరుమాళ్ ఆలయం కనీవినీ ఎరుగని దృశ్యాన్ని చూసి పులకించిపోయింది. ఒకటా.. రెండా? 200 సంవత్సరాలుగా ఎన్నడూ ఎరుగని అపురూప ఘట్టం ఆనాడు ఆవిష్కృతమైంది. ఈ రాష్ట్రం లోని కాళ్ళకురిచ్చి పరిధిలోగల ఎడుతవైనాథం గ్రామప్రజలు నిజంగా తమకు కలిగిన అనుభవానికి ఆనందంతో మైమరచిపోయారు. ఈ గ్రామంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులంతా ఇది కలా.. నిజమా అని ఆశ్చర్యపోయారు. ఇందుకు కారణం ఈ ఆలయ ప్రవేశానికి తమకు అనుమతి లభించడమే..
దాదాపు రెండు శతాబ్దాలుగా వరదరాజ పెరుమాళ్ ఆలయంలో దళితులకు ప్రవేశం లేదు.. నిమ్న జాతులవారికి ఈ ఆలయంలో ప్రవేశించే అర్హత లేదని అగ్రవర్ణాలు నిషేధిస్తూ వచ్చాయి. ఇది ఆచారమని, దళితులు ప్రవేశిస్తే ఆలయం అపవిత్రమై పోతుందని వారు కనీసం ఈ గుడి వద్దకు రావడంపై కూడా ఆంక్షలు విధించారు. 2008 నుంచి ఈ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. పైగా ఆలయ ఉత్సవాల్లో వేటి లోనూ దళితులు పాల్గొనే వీల్లేదు కూడా.
. కానీ ఈ కుల వివక్ష నశించాలని, భక్తితో తాము కూడా ఈ ఆలయంలో ప్రవేశించి భగవంతుడిని ఆరాధించేందుకు అనుమతించాలని వీరు చాలాకాలంగా అధికారులను కోరుతూ వచ్చారు. ఈ గుడి ప్రైవేటు వ్యక్తుల అధీనంలో ఉందని ఇన్నాళ్లూ వీరు భావిస్తూ వచ్చారు. చివరకు ఇది ప్రభుత్వ దేవాదాయ శాఖ కింద ఉన్నట్టు తెలుసుకుని తమ అభ్యర్థనతో ఒత్తిడి పెంచారు.
ఇటీవల జిల్లా కలెక్టర్ ను కలిసి తమ విజ్ఞప్తిని ఆయన ముందు ఉంచారు. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు. సంబంధిత చట్టాల కింద దళితులపై ఇలాంటి నిషేధం కూడదన్నారు. అగ్రవర్ణ పెద్దలతో కలిసి నిర్వహించిన సమావేశంలో అంతా దీనికి ఆమోద ముద్ర వేశారు. చివరకు 400 మంది పోలీసుల పటిష్ట భద్రత మధ్య సుమారు 300 మంది దళితులు ఈ నెల 1 న ఈ ఆలయ ప్రవేశం చేశారు. రెండు శతాబ్దాల తరువాత మొట్ట మొదటిసారిగా వీరు వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ప్రార్ధనలు, పూజలు చేయడం విశేషం.