నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ.. చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. బైపోల్‌ను తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఓ అవకాశంగా మార్చుకుంటున్నారు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో వారు కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.దాదాపు 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు.. నిడమనూరులోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి నామినేషన్ పత్రాలను తీసుకెళ్లారు. ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లతో హాలియాలో బహిరంగ సభ నిర్వహిస్తామని వారు చెప్పారు. ఆతర్వాత సాగర్ నియోజకవర్గానికి చెందిన 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లతో నామినేషన్లు వేయిస్తామని తెలిపారు. తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకే ఈ నామినేషన్లు వేస్తున్నట్టు చెప్పారు.
గతంలో నిజామాబాద్ ఎంపీ స్థానంలోనూ పసుపు, మొక్కజొన్న రైతులు.. ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు భారీగా నామినేషన్లు వేశారు. వారణాసిలో ప్రధాని మోదీకి ఈ తరహాలో తమ నిరసనను తెలిపారు.