భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజుల నుంచి కేసులు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. మొన్నటి కంటే నిన్న నాలుగువేలకు పైగా కేసులు తక్కువగా నమోదవ్వగా.. ఈ రోజు కూడా భారీగా తగ్గాయి. కొత్తగా 3,06,064 మంది వైరస్ బారినపడ్డారు. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,49,335కి చేరింది.
కొత్తగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా.. రికవరీ అయిన వారి సంఖ్య 3,68,04,145కి చేరింది. దేశంలో రికవరీ రేటు 93.07% శాతానికి చేరుకోగా వారంవారీ పాజిటివిటీ రేట్ 17.03% శాతంగా నమోదు అయింది. కొత్తగా మహమ్మారి బారిన పడి 439 మంది మృతి చెందారు. దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నారు. మాస్కులు వాడకం, సామాజిక దూరం పాటించడం వంటివి తప్పని సరిచేశారు. దీనికి తోడు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా కొనసాగుతోంది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వారికి మొదటి డోసు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అటు, 60 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోసులు కూడా పంపిణీ చేస్తున్నారు.
Advertisements
తాజాగా 12 నుంచి 15 ఏళ్ల లోపు ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 162.26 కోట్ల వాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ఇటీవల కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా ప్రభుత్వాలు గణనీయంగా పెంచుతున్నాయి. ఇప్పటివరకు కరోనా పరీక్షలు 71.69 కోట్లు దాటినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 14,74,753 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3170 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.