దేశంలో కరోనా తీవ్రత కొద్ది రోజులుగా ఒకేలా కొనసాగుతోంది. వరుసగా 11వ రోజూ 30 వేలలోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,712 మంది ఈ వైరస్ బారినపడ్డారు. నిన్నటి కేసుల కంటే స్వల్పంగా పెరిగాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఒక కోటీ లక్షా 23 వేల 778కి చేరింది.
ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారిలో 96.93 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 2.83 లక్షలు ఉన్నాయి. కరోనా కారణంగా నిన్న 312 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,46,756గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల బ్రిటన్ నుంచి ఇండియా వచ్చిన వారిలో 22 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టేగా నిర్దారించారు.