ద్వాపర యుగంలో వేలమంది గోపెమ్మలు కృష్ణుని వరించారని,తమ భక్తిని చాటుకున్నారని, భర్తగా స్వీకరించారని. తమ తనువు మనసు ఆ పరమాత్ముడికే అంకితమిచ్చి, అతని సేవలో తరించారని చెబుతారు.
తరువాత కాలంలో మీరా, సక్కుబాయి వంటి వారు కూడా కృష్ణుడినే తమ భాగస్వామిగా అనుకుని అతి భక్తి పారవశ్యంలోనే తరించి తనువు చాలించారు. అయితే కలియుగమని చెప్పబడే నేటి కాలంలో కూడా ఓ యువతి కృష్ణుని ప్రేమించి,అతనినే వరుడిగా స్వీకరించింది.
విడ్డూరంగా అనిపిస్తుంది కదూ నిజమండీ.! బాల్యం నుంచి కృష్ణుడిపై ప్రేమను పెంచుకున్న రక్షా సోలంకి ఆయననే వివాహం చేసుకోవాలనుకుంది. శనివారం బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.
రక్షా సోలంకి.. ఔరేయా జిల్లాలోని బిధునా పట్టణంలో నివసిస్తుంది. ఈమెకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరిగి పెద్దదైన కొద్దీ కృష్ణుడినే ఆరాధిస్తూ ప్రేమను పెంచుకుంది రక్షా.
చివరకి ఆయననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహానితో పెళ్లి చేసుకుంది రక్షా సోలంకి. ఇటీవల కృష్ణుడుని పెళ్లి చేసుకున్న రక్ష.. మెహందీ రోజున కన్నయ్య డిజైన్ను తన చేతులపై వేసుకుంది.
పెళ్లి కూతురు ఆహ్లదకరమైన, మనసుకు ప్రశాంతతనిచ్చే భక్తి పాటలను పాడి అందరిలో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా వివాహాలలో వరుడు.. వధువుకు గంధం రాసి కుంకుమ పెడతాడు.
కానీ ఈ పెళ్లిలో రక్షా సోలంకి.. కృష్ణుడు పేరున తనకు తానే కుంకుమ పెట్టుకుంది. వీరి వివాహం తర్వాత బంధువులంతా ఆచార వ్యవహారాల ప్రకారం వధువుకు అప్పగింతల కార్యక్రమం కూడా జరిపారు.
కృష్ణుడు విగ్రహంతోనే వధువు ఇంటి నుంచి బయటకొచ్చింది. రక్షా సోలంకి వివాహం పట్ల ఆమె తండ్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తన కూతురు సరైన నిర్ణయం తీసుకుందని.. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అల్లుడని అనందం వ్యక్తం చేశాడు.
తనకు కొన్ని రోజులుగా శ్రీకృష్ణుడి గురించి కలలు వస్తున్నాయని చెప్పింది వధువు రక్షా సోలంకి. “కళలో శ్రీ కృష్ణుడు నా మెడలో పూలమాల వేస్తున్నట్లుగా కనిపించాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాను. వెంటనే వారు నాకు వేరే పెళ్లి చేయాలని భావించారు.
కానీ నా తల్లిదండ్రులతో మాట్లాడి కన్నయను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. వారు కూడా పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. శ్రీకృష్ణుడుతో పెళ్లి జరగడం వల్ల చాలా ఆనందాన్ని పొందాను.’ అని రక్షా సోలంకి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.