దేశంలో కరోనా మరోసారి పడగవిప్పుతోంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. అంతకు ముందు వారంతో పోల్చితే గతవారం కేసుల్లో 35శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మూడు మినహా మిగతా రాష్ట్రాల్లో కరోనా కేసులు తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే విషయం.
ఈ నెల 11- 17 మధ్య దేశంలో సుమారు 6,610 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు చెప్పారు. అంతకు ముందు వారం 4,900 కేసులు బయటపడినట్టు వివరించారు. మునుపటి వారంలో సుమారు 7,010 కేసులు నమోదయ్యాయి.
అయితే ఈ వారంలో కేసుల సమాచారాన్ని కేరళ వెల్లడించలేదు. దీంతో ఆ కేసులను మినహాయించారు. ఏప్రిల్ 4-10 మధ్య కేరళలో 2,185 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో మూడవ వంతు ఇక్కడ నుంచే నమోదు కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణాలో వారంలోనే కేసులు రెట్టింపు సంఖ్యలో పెరగడం గమనార్హం. ఢిల్లీలో 2,307 కేసులు నమోదుకాగా ముందువారంతో పోల్చితే ఇది 145 శాతం అధికంగా ఉన్నాయి. హరియాణాలో వారాంతపు కేసులు 118 శాతం మేర పెరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోనూ కేసుల్లో పెరుగుదల 141 శాతంగా ఉన్నట్టు అధికారులు చెప్పారు
కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్‌లో కరోనా కేసుల్లో కొద్దిపాటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. గతవారంలో గుజరాత్‌లో 110 కేసులు నమోదు కాగా రాజస్థాన్‌లో ఈ వారం 90 కేసులు నమోదయ్యాయి.