రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితుల్లో వైద్య విద్య తదితర కోర్సుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఇటీవల వారిని తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లింది. ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది.
దీంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించాల్సిందిగా కోరినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల చిరునామాలను సేకరిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. ఏపీ, తెలంగాణకు చెందిన సుమారు 350 మంది తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కూడా వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. అక్కడ ఉన్న విద్యార్థుల భద్రత కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని కోరింది.