చండీగఢ్ ను కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి. విద్యుత్ సిబ్బంది సమ్మె నేపథ్యంలో చండీగఢ్ లోని పలు ప్రాంతాలు 36 గంటలుగా అంధకారంలో మునిగిపోయాయి. వేలాది ఇండ్లకు నీటి సరఫరా లేకుండా అయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ లైట్లు సైతం పనిచేయడం లేదు. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది.
విద్యుత్ లేక పోవడంతో చాలా ఆస్పత్రుల్లో ఆపరేషన్లను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ మా దగ్గర జనరేటర్లు ఉన్నాయి. అయితే 100 శాతం వాటిపైనే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే సర్జరీలను పోస్ట్ పోన్ చేస్తున్నాము” అని వైద్యులు చెబుతున్నారు.
విద్యుత్ శాఖను ప్రైవేట్ పరం చేయడంపై రాష్ట్రంలో విద్యుత్ సిబ్బంది సమ్మెకు దిగారు. దీనివల్ల ప్రజలకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ కార్మికుల యూనియన్ తో కేంద్రపాలిత ప్రాంత సలహాదారు ధరమ్‌పాల్ పవర్‌మెన్ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి స్పష్టతా రాలేదు.
ఈ క్రమంలో విద్యుత్ శాఖలో ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయినప్పటికీ విద్యుత్ సిబ్బంది సమ్మె విరమించడం లేదు. దీంతో సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది..