తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తగ్గుతుందని భావించిన ప్రతీసారి పెరుగుతోంది. నిపుణుల అంచనాలను తల కిందుల చేస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధ పడుతున్నారు. దీంతో టెస్టింగ్ ల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అంతేగాకుండా..రాష్ట్రంలో ఫీవర్ సర్వే కూడా చేపట్టింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
గత 24 గంటల్లో కొత్తగా 3,801మందికి వైరస్ సోకింది. ఈరోజు కరోనాతో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,47,155కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 4,078మంది మృతి చెందారు. ఈ రోజు 2,046 మంది కోలుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 7,05,054కి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.37 శాతంగా నమోదైంది.
ఇంకా 38,023 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 88,867 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు 3,16,78,469 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలో 1,570 మందికి మహమ్మారి సోకింది. తర్వత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 254, రంగారెడ్డి జిల్లాలో 284, హన్మకొండ జిల్లాలో 147 కేసులు బయటపడ్డాయి.
కరోనా కట్టడికి రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. మాస్కులు వాడకం, సామాజిక దూరం పాటించడం లాంటివి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలతో పాటు వైరస్ కట్టడికి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జరుగుతోంది.