దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 17,77,962 మందికి పరీక్షలు చేయగా.. 38,353 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంతకుముందు రోజు కంటే కేసులు 36శాతం పెరిగాయి. అలాగే కొత్తగా 497 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,29,179 కు పెరిగింది.
మరోవైపు రికవరీలు పెరుగుతుండడం కాస్త ఊరట కలిగిస్తోంది. కొత్తగా 40,013 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటిదాకా దేశంలో 3.12కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు.. 3,86,351గా ఉన్నాయి. నిన్న 41,38,646 మందికి టీకాలు వేయగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 51,90,80,524కు పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేరళ నుంచే ఉన్నాయి. దేశం మొత్తం మీద గత 24 గంటల్లో 38,353 కేసులు బయటపడితే.. ఒక్క కేరళ నుంచే.. 21,119 కేసులు నమోదయ్యాయి. అలాగే 497 మంది మరణాల్లో 152 అక్కడి నుంచే ఉన్నాయి.