ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభిస్తోంది. చైనా, జపాన్, అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు అలర్ట్ అయ్యాయి. వ్యాక్సినేషన్‌ను వేగాన్నిపెంచుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయా దేశాల ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎయిర్ పోర్టులోనే కొవిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. గత రెండురోజుల్లో భారత్‌కు వచ్చిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 39 మందికి కరోనా సోకినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఈ మేరకు విషయాన్ని ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి.
ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ర్యాండమ్‌గా సుమారు 6వేల మందికి పరీక్షలు నిర్వహించారు. విమానాశ్రయాలకు వచ్చి వెళ్లే ప్రయాణికులందరికీ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది.