కరోనా మహమ్మారి ఈ ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇంకా చాలా మందిని ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టింది. అయితే కొంతమంది కరోనాను తట్టుకొని బ్రతికి బయట పడగా, మరికొందరు మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 130 రోజులు కోవిడ్ తో పోరాడి కోలుకోగలిగాడు. యూపీకి చెందిన ఆ వ్యక్తి నాలుగు నెలలకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొంది తాజాగా డిశ్చార్జ్ అయ్యాడు.
వివరాల్లోకి వెళితే… మీరట్ కు చెందిన ఆ వ్యక్తి పేరు విశ్వాస్ సైనీ. ఈ ఏడాది ఏప్రిల్ 28న ఆయనకరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందుగా ఆయన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పట్నుంచి మొదలుకొని సైనీ నెల రోజుల పాటు ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్ సపోర్టుతో ఉన్నాడట. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్లు వెల్లడించారు.
ఆయన పరిస్థితి చూసిన డాక్టర్లు అసలు బ్రతుకుతాడు అనుకోలేదట. తాజాగా ఇంటికి వచ్చిన అతని మొహంపై ఆక్సిజన్ మాస్క్ కారణంగా అయిన గాయాలు కనిపించాయి. మొత్తానికి కరోనాతో కొన్ని నెలలు పోరాడి ఇంటికి చేరుకున్న ఆయన కుటుంబ సభ్యులను చూసి చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సందర్భంగా తనకు వైద్యం చేసిన డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్ బెడ్ పైనే ఉండి ఎంతోమంది చనిపోవడం చూసిన ఆయన తాను కోలుకున్నందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు.