తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 42,737 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 397 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా నిన్న మరో ఇద్దరు చనిపోయారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 2,85,465కి చేరింది. ఇక మరణాలు 1535కు పెరిగాయి.
కరోనాబారి నుంచి తాజాగా 627 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 2,77,931కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,999 ఉంది. ఇందులో 3,838 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 68 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.