లోక్ సభలో ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ ను స్పీకర్ ఎత్తివేశారు.
సభలోకి ప్లకార్డులు తీసుకు రావద్దంటూ సభ్యులందరికీ స్పీకర్ సూచించారు. సభా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిత్యావసరాలపై జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం పై చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్బంగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు.
దీంతో వారిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు కాంగ్రెస్ ఎంపీలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కు గురైన వారిలో మానిక్కం టాగూర్, రమ్య హరిదాస్, టీఎన్ ప్రతాపన్, ఎస్ జ్యోతిమణిలు ఉన్నారు.
సమావేశాలు ముగిసేవరకు వీరిపై సస్పెన్షన్ అమలులో ఉంటుందని సభాపతి ఓం బిర్లా ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీల ప్రవర్తనపై స్పీకర్ కు కాంగ్రెస్ లోక్సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి వివరణ ఇచ్చారు. స్పీకర్ ను అవమానించాలన్నది తమ సభ్యులు ఉద్దేశం కాదన్నారు.