రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో శనివారం ఎల్ఫీజీ సిలిండర్లు పేలిపోగా నలుగురు సజీవ దహనమయ్యారు.వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. 16 మంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సిటీలోని కీర్తి నగర్ ఏరియాలో సిలిండర్ లోకి గ్యాస్ నింపుతుండగా ఆరు సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
ఈ ఘటనలో పలు వాహనాలు కాలిపోగా దగ్గరలోని ఓ ఇంటికి కూడా నిప్పంటుకున్నట్టు పోలీసులు తెలిపారు, పేలుడు ధాటికి ఈ ఇంటిలోని కొంత భాగం కూలిపోయిందన్నారు. పేలుడుకు కచ్చితంగా కారణం తెలియడం లేదని, దర్యాప్తు ప్రారంభించామని వారు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్ హిమాంశు గుప్తా ఆదేశించారు.
దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భూమరన్ లోహర్ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్లు స్టోర్ చేసి ఉంచారని, బహుశా వీటిని అక్రమంగా దాచినట్టు భావిస్తున్నామని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా నాలుగు డజన్ల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు వారు తెలిపారు.
ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరగవచ్చునని వారు పేర్కొన్నారు.సిలిండర్ల పేలుడుతో ఆ ప్రాంతమంతా భీతావహ పరిస్థితి నెలకొంది.