జమ్మూలోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ఈ జిల్లాలోని అప్పర్ ధాంగ్రి గ్రామంలో ప్రవేశించి హిందువుల ఇళ్లను టార్గెట్ గా చేసుకుని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మరణించగా 9 మందికి పైగా గాయపడ్డారు. రామాలయానికి దగ్గరలోనే గల ఇళ్ళమీద వీరు విరుచుకుపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రాజౌరిలోని ఆసుపత్రికి తరలించారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడినవారిలో ముగ్గురు అప్పటికే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. టెర్రరిస్టుల మారణకాండకు నిరసనగా సోమవారం వివిధ సంఘాలు ఈ జిల్లాలో బంద్ కు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదులు కాల్పులు జరిపి వెంటనే పారిపోయారని, వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని జమ్మూ జోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. అప్పర్ ధాంగ్రి గ్రామంలో పోలీసు పికెట్ ని ఏర్పాటు చేశామన్నారు.
ముస్లింలు ఎక్కువగా ఉన్న ఈ గ్రామంలో కేవలం ఓ వర్గం వారిని టార్గెట్ గా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. సైన్యం, పారామిలిటరీ బలగాలు. జిల్లా అధికారులు కూడా ఈ గ్రామాన్ని విజిట్ చేసి పరిస్థితిని మదింపు చేస్తున్నారు. కొత్త సంవత్సరం నాడు శ్రీనగర్ జిల్లా లోని హవాయ్ చౌక్ వద్ద కూడా టెర్రరిస్టులు దాడికి యత్నించారు. సీఆర్పీఎఫ్ జవాన్లకు చెందిన ఓ బంకర్ పై వారు గ్రెనేడ్ విసిరారు. అయితే అది మిస్ అయి రోడ్డుపైనే పేలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు.
జమ్మూ సిటీ శివార్లలోని సిధ్ర వద్ద పాక్ లష్కరే తోయిబాకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనాస్థలం వద్ద పెద్ద సంఖ్యలో ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.